ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పేదలకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను ప్రారంభించింది. ఆగస్ట్ 25వ తేదీ నుంచి ఈ కార్యక్రమాన్ని నాలుగు విడతల్లో అమలు చేస్తున్నారు. ఇప్పటికే మూడు విడతల్లో లబ్ధిదారులకు కార్డులు పంపిణీ చేశారు. ఇప్పుడు చివరిగా, సెప్టెంబర్ 15వ తేదీ నుంచి నాలుగో విడతగా కొన్ని జిల్లాల్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది. అయితే, ఈ కార్డులు జూన్ 30వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఇవ్వనున్నట్టు అధికారులు స్పష్టం చేశారు.
ఇక జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య దరఖాస్తు చేసిన వారికి రెండో విడతలో కార్డులు అందిస్తామని పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు. ఈ స్మార్ట్ కార్డుల ద్వారా రేషన్ సరఫరాలో పారదర్శకత పెరగడమే కాకుండా, బోగస్ కార్డులను తొలగించడంలోనూ సహాయపడనుంది.
సెప్టెంబర్ 15 నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల ఆఖరి విడత పంపిణీ ప్రారంభం కానుంది. ఈ దశలో పల్నాడు, బాపట్ల, వైఎస్సార్ కడప, అన్నమయ్య, శ్రీసత్యసాయి, నంద్యాల, కర్నూలు, ప్రకాశం జిల్లాల లబ్ధిదారులకు ఈ కార్డులు పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే ఆయా జిల్లాల తహశీల్దార్ కార్యాలయాలకు స్మార్ట్ కార్డులు చేరుకున్నాయి.
ఈ కార్డులను గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే చేరవేస్తారు.
స్మార్ట్ కార్డులపై ఉన్న క్యూఆర్ కోడ్ ద్వారా రేషన్ సరుకుల వివరాలు తెలుసుకునే అవకాశం లభిస్తుంది. కార్డులు పంపిణీ సమయంలో బయోమెట్రిక్, ఐరిస్ స్కాన్, ఓటీపీ లేదా ఫేస్ రికగ్నిషన్ ద్వారా ధృవీకరణ చేస్తారు.
కార్డులలో తప్పులున్నట్లయితే, వాటిని సరిచేసుకునేందుకు గ్రామ, వార్డు సచివాలయాల్లో అవకాశాలు కల్పించారు. అలాగే మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా సవరణలు చేయవచ్చు. ఈ అవకాశాన్ని ఈ నెలాఖరు వరకూ వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు
.
Tags
Ration cards in ap
